ఎన్టీఆర్ కు ఇప్పుడు షూటింగ్ పూర్తికాగానే మరో పని ఏమిటీ అంటే తను కట్టిస్తున్న స్టూడియోని పర్యవేక్షించటం అని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ స్టూడియోకు ఎన్టీఆర్ స్టూడియో అని నామకరణం చేస్తున్నట్లు సినీవర్గాల తాజా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వందల ఎకరాల ఆసామి. అల్లుడి కోరిక మేరకు స్టూడియో నిర్మాణానికి హైదరాబాద్‌లోని ఖరీదైన స్థలాన్ని ఎన్టీఆర్‌కు ఇచ్చారని, ఆ స్థలంలోనే జూనియర్ స్టూడియో నిర్మాణం జరుపబోతున్నాడని అంటున్నారు. తన తాత ఎన్టీఆర్ పేరుతో నిర్మాణం కాబోతున్న ఈ స్టూడియో హైటెక్ సిటీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకోనుంది.
తన సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించుకోవడంతో పాటు, ఇతర సినిమా షూటింగ్‌లకు దీన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఉన్న రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలు కొద్దిగా పురాతనమైనవి. వీటికి భిన్నంగా ఇప్పటి ట్రెండ్‌కు తగిన విధంగా సరికొత్త డిజైన్స్‌తో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతోందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది. ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకునే సమయం. ఇదే ఊపులో ‘దమ్ము’ చిత్రం కూడా విజయఢంకా మోగించి వారి ఉత్సాహాన్ని రెండింతలు చేయాలని ఆశిద్దాం. బోయపాటి శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
0 comments